Wed. May 25th, 2022

  గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు చక చక ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా సభ నిర్వహణ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది పాలకులు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అణగతొక్కాలని చూస్తున్నారని, అంతిమంగా గెలిచేది ధర్మమేనని అన్నారు.

  సోమవారం సాయంత్రం ఆవిర్భావ సభ స్థలిని సందర్శించారు. సభ ప్రాంగణం, వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ… “ ఆవిర్భావ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 7 ఎకరాల్లో సభ ప్రాంగణం ఉంటుంది. వాహనాల పార్కింగ్ కోసం మరో 18 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నాము. మూడు ప్రధాన రహదారుల నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. విజయవాడ – చెన్నై జాతీయ రహదారి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో సభను ఏర్పాటు చేశాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఆహారం, మంచినీరుతో పాటు మహిళలకు టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం.  ప్రతి ఒక్కరు జాగ్రత్తగా సభా స్థలికి చేరుకొని, అంతే జాగ్రత్తగా తిరిగి వెళ్లేలా ఈ ప్రాంతంలో రోడ్లను మరమ్మతులు చేయిస్తున్నాం. అలాగే లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. సభను విజయవంతం చేయడానికి పార్టీ నుంచి 12 కమిటీలు నియమించాం. ఆ కమిటీలు పనులు చురుగ్గా జరిగేలా చూస్తున్నాయి. 

  భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

  రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ సభ చిరస్థాయిగా మిగిలి పోతుంది. అమరావతి రైతుల పోరాటం… ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం,  వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టంపై అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. అలాగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఏ విధంగా పనిచేయాలని, ప్రజల్లోకి ఎలా వెళ్లాలి వంటి అంశాలపై రోడ్డు మ్యాప్ అందిస్తారు.  శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కోసం  జనసేన శ్రేణులతో పాటు యావత్తు రాష్ట్రం ఆస్తకిగా ఎదురుచూస్తోంది. 

  పోలీసులు సహకరిస్తారని నమ్ముతున్నాం

  సభ నిర్వహణకు అనుమతుల కోసం ఫిబ్రవరి 28న పోలీసు ఉన్నతాధికారులకు లెటర్ రాశాం.  సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరాం. అయితే ఇప్పటికీ పోలీస్ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బిజీగా ఉన్నామని చెబుతున్నారు. త్వరలోనే సభ స్థలికి వస్తామని చెబుతున్నారు. వాళ్లు ప్రభుత్వ పరంగా భద్రత చర్యలు తీసుకుంటారనే నమ్మకం మాకు ఉంది. ఒకవేళ భద్రత చర్యలు తీసుకోని పక్షంలో మా నాయకులకు ఉన్న అనుభవంతో సభ శాంతియుతంగా జరిగేలా మేమే చర్యలు తీసుకుంటామని” చెప్పారు. ఈ కార్యక్రమంలో  పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్,  రాష్ట్ర కార్యదర్శులు శ్రీ సయ్యద్ జిలానీ, శ్రీ నయూబ్ కమాల్,  భూములిచ్చిన రైతులు పాల్గొన్నారు.